Disable Copy Paste - HTML/JavaScript

Sunday, April 20, 2014

లిల్లీ


( గమనిక:  ఇది   కల్పనతో   కూడిన   పిల్లల   నీతి   కథ )

“అనగనగ   ఒక   ఊరులో   రాము   మరియు   సీత   అని   భార్యాభర్తలు   ఉండేవారు.      ఆ   ఇద్దరు   కాస్త   రెండు   సంవత్సరాలలో   నలుగురు   అయ్యారు.   ఈ   దంపతులకు   మొదటి   సంతానం   కలిగినప్పుడు   చిన్న   విషయం   మీద   పెద్ద   గొడవ   వచ్చింది.   “నేను   చెప్పిన   పేరు   పెట్టాలి,   అని   సీత   అంటే,   “కాదు!   నేను   చెప్పిన   పేరు   పెట్టాలి,   అని   రాము   అంటూ   ఇద్దరు,   అసెంబ్లీలో   అధికార   పార్టీ   ప్రతిపక్ష   పార్టీ   లాగ   గొడవ   పడ్డారు.   చివరికి   ఇద్దరు   ఈ   విషయం   మీద   రాజీ   పడి   ఒక   ఒప్పందానికి   వచ్చారు.   ఎలాగో   ఇద్దరు   పిల్లలు   కావాలనుకున్నారు   కాబట్టి,   ఒకరికి   సీత   ఇంకొకరికి   రాము   పేరు   పెడదామని   నిర్ణయించుకున్నారు.   మొదట   ఎవరు   పేరు   పెట్టాలన్న   విషయాన్ని   ఒక   రూపాయి   బిళ్ళకు   అప్పగించారు.   బహుశా   సీత,   డబ్బును   తెలివిగా   పొదుపుగా   వాడే   ఇల్లాలు   లాగ   ఉన్నట్లుంది.   టాసు   వేస్తే   సీతకు   అనుకూలంగా   వచ్చింది.   మొదటి   పాపకు    సీత,   “అనన్య”   అని   పేరు   పెట్టింది.   రాముడికి   కృష్ణుడు   అంటే   బాగా   ఇష్టమేమో!   మరుసటి   సంవత్సరం   పుట్టిన   బాబుకు   రాము,   “కృష్ణ   అని   పేరు   పెట్టాడు.


అనన్యకు   పిల్లులు   అంటే   విపరీతమైన   పిచ్చి.   కృష్ణకేమో   కుక్కపిల్లలు   అంటే   అంతే   పిచ్చి.   ఒక   రోజు   రాము   ముద్దొచ్చే   పిల్లిని,   కుక్కపిల్లని   ఇంటికి   తీసుకొచ్చాడు.   ఈసారి   వాటికి   పేరు   పెట్టడానికి   దంపతలు   గొడవ   పడకుండా   అక్కాతమ్ముళ్ళకి   వదిలేసారు.   అక్క   పిల్లికి   “లిల్లీ   అని,   తమ్ముడు   కుక్కపిల్లకి   “స్నూపీ   అని   ఇద్దరు   నామకరణం   చేసారు. ఆ   అక్కాతమ్ముళ్ళు   చూపించే   గారాబంతో   లిల్లీ   మరియు   స్నూపీ   విలాసవంతమైన   జీవితం   గడిపేవి.   వీళ్ళిద్దరూ   వయసుతో   పాటు   వీళ్ళు   చూపించే   గారాబం   కూడా   పెంచుతూ   వచ్చారు.   గారాబం   చెయ్యడం   అనేది   వీళ్ళకు   రోజువారి   అవసరాలలో   ఒకటైపోయింది.


ఏడవ   తరగతి   అయ్యాక   అనన్యకు   మంచి   పాఠశాలలో   చదవడానికి   అవకాశం   వస్తుంది.   కొన్ని   సార్లు   మంచి   వార్తలు   తమతో   విషాదాన్ని   కూడా   తోడు   తీసుకొస్తాయేమో!   అనన్య   ఇల్లు   వదిలి   హాస్టలుకు   వెళ్ళాల్సిన   పరిస్థితి   వస్తుంది.   హాస్టలులో   లిల్లీని   అనుమతించరని   తెలిసి,   లిల్లీని   తనతో   తీసుకెళ్లడానికి   కుదరక   పోవడంతో   బాగా   దిగులు   పడుతుంది.


అనన్య   ఎందుకు   అలా   దిగులుగా   ఉందొ   లిల్లీకి   ఇంకా   ఏమాత్రం   అర్ధం    కాక,   తన   ఒడిలో   కూర్చుని   ఓదార్చడానికి   ప్రయత్నిస్తుంది.   అనన్య   ప్రయాణిస్తున్న   సామాను   చూడగానే,   “మిఆవ్   మిఆవ్......!!   అని   అరవడం   మొదలు   పెట్టింది.   బహుశా   “వెళ్లొద్దు   వెళ్లొద్దు......!!””   అని   తన   భాషలో   చెప్పిందేమో.   లిల్లీని   అమ్మకు   అప్పగించేసి   అనన్య   వెళ్ళిపోతుంది.


సీత,   లిల్లీని   బాగా   చూసుకున్తున్నపటికీ,   లిల్లీకి   మాత్రం   అనన్య   లేని   లోటు   బాగా   ఉండేది.


ఇప్పుడు   నన్ను   ఎవరు   గారాబం   చేస్తారు   ?
నాకు   మంచి   ఫోటోలు   ఎవరు   తీస్తారు   ?
నేను   వేసే   డాన్సులు   ఎవరు   వీడియో   తీస్తారు   ?
నేను   అలిగితే   ఎవరు   బుజ్జగిస్తారు   ?,   అని   దిగులు   పెట్టుకుంటుంది   లిల్లీ.


ఇంకో   వైపు   అనన్య   కూడా   మొదట్లో   బాగానే   బాధపడేది.   కాని   చదువుల్లో   పడ్డాక,   బాధ   క్రమంగా   తగ్గింది.  


ఇలా   ఉండగా   ఒక   రోజు,   “నేనే   నీ   కంటే   గొప్ప!   అందుకే   నాకు   ఈ   ఇంట్లో   ప్రత్యేక   స్థానం   ఉంది”,   అని   స్నూపీ   లిల్లీని   ఎగతాళి   చేస్తుంది.  


కాదు!   కృష్ణ   వల్ల   నీకు   ఇంట్లో   ప్రత్యేక   స్థానం   ఉంది   కాని,   నువ్వు   అంత   గొప్పేమీ   కాదు,   అని   లిల్లీ   సమాధానమిస్తుంది.  


లిల్లీ   సమాధానం   పట్టించుకోకుండా,   స్నూపీ   ఎగతాళి   చేస్తూనే   ఉంటుంది.  


పోటి   పెట్టుకుంటే   ఎవరు   గొప్పో   తెలుస్తుంది   కాని,   నీకు   నువ్వు   గొప్ప   అనుకుంటే   సరి   పోదు.   మరి   పోటీకి   నువ్వు   సిద్ధమేనా   ..?,   అని   స్నూపీకి   సవాలు   విసురుతుంది   లిల్లీ.


స్నూపీ   కూడా   పౌరుషంతో   సవాలుకి   ‘సై’   అంటుంది. ఇద్దరు   కలిసి   పోటీలో   ఐదు   పనులు   నిర్ణయిస్తారు.

1)    మూడు   రౌండ్లలో   ఎవరు   ఎక్కువ   దూరం   గెంతుతారో
(లాంగ్   జంప్),   వాళ్ళే   గెలిచినట్లు”
పాపం   లిల్లీ   ఒక్క   అడుగు   దూరంతో   ఓడిపోతుంది.

2)  పరుగు   పందెం   –   ఒక   రౌండ్   మాత్రమే
మొదటి   గెలుపుతో   స్నూపీ   కళ్ళు   నెత్తికెక్కేస్తాయి.   ఆ   గర్వం,   అతి   నమ్మకంతో   ఈ   సారి   ఓడిపోతుంది.

3)  షర్టు   గుండీని   కిటికీలో   నుంచి   తోటలోకి   విసిరాక,   దాన్ని   ఎవరు   ముందు   తెస్తారో   వాళ్ళు   గెలిచినట్లు
లిల్లీ   నిజాయితీగా   ప్రయత్నం   చేసినప్పటికీ,   స్నూపీ   పుట్టుకతోనే   వాసన   పసిగట్టడంలో   ప్రావీణ్యం   ఉంది   గనుక   తను   ఓడిపోతుంది.  

4)  మూడు   రౌండ్లలో   బంతిని   ఎవరు   ఎక్కువ   దూరానికి   తంతారో   వాళ్ళు   గెలిచినట్లు
ఈ   సారి   లిల్లీ   నిజాయితీగా   చేసిన   ప్రయత్నం   వృధా   అవ్వలేదు.   మూడు   రౌండ్లలో   లిల్లీనే   గెలుస్తుంది.

5)  తోటలో   ఫుట్   బాల్   ఆట
ఇప్పటి   వరకు   ఇద్దరరు   చెరో   రెండేసి   సార్లు   గెలిచారు.
ఇదే   చివరి   పని.   పోటీ   గెలుపు   ఈ   పని   మీద   ఆధార పడింది.
గెలిచిన   క్రమం   అనుసరిస్తే   ఈసారి   స్నూపీ   గెలవాలి.
కాని   క్రమం   లిల్లీని   ఓడించలేక   పోయింది.   పోటీలో   లిల్లీ   నెగ్గుతుంది.


చాలా   రోజులుగా   దిగులుగా   ఉన్న   లిల్లీ   ఆరోజు   తన   గెలుపుని   బాగా   ఆశ్వాదిస్తూ   ఆనందపడుతుంది.   కృష్ణ   వచ్చి   స్నూపీని   గారాబం   చెయ్యడంతో,   గెలిచిన   సంతృప్తి   కాసేపటికే   ఆవిరైపోతుంది.   ప్రేమానురాగాలు   లేకపోతే,   ఎన్ని   పోటీలు   గెలిచినా,   ఎంత   డబ్బు   ఉన్నా   ఆనందం   ఉండదని   లిల్లీకి   తెలుసేమో!   మళ్లీ   తన   దిగులు   లోకానికి   వెళ్ళిపోతుంది.   పోటీ   జరిగిన   మరుసటి   రోజు,   స్నూపీ   దిగులుగా   ఉండడం   చూసిన   లిల్లీ,   విషయం   ఏంటని   అడుగుతుంది.   “కృష్ణ   తన   స్నేహితులతో   ఎదో   పర్యటనకి   వెళ్ళాడు.   ఇంకో   మూడు   వారాలయ్యాక   వస్తాడట,   అని   చెప్తుంది.


మూడు   వారాలే   కదా!   ఇట్టే   అయ్యిపోతాయి   చూడు.   నువ్వు   దిగులు   పడొద్దు.   నీకేమన్నా   సాయం   కావాలంటే   చెప్పు.   నేను   చేస్తాను,   అని   లిల్లీ   ఓదారుస్తుంది.  


ఈ   మాటలు   విన్న   స్నూపీ   తన   తప్పు   తెలుసుకుంటుంది.     


నిన్ను   హేళన   చేసినందుకు   నన్ను   క్షమించు!”,   అని   పశ్చాత్తాపం   చెందుతూ,      “పద!   నీకు   ముక్కుతో   వస్తువులు   ఎలా   పసిగట్టాలో   నేర్పిస్తాను.   నువ్వు   నాకు   ఫుట్   బాల్   ఎలా   ఆడాలో   నేర్పించు,   అని   లిల్లీని   తోటకి   లాక్కెళ్తుంది   స్నూపీ.  


ఆరోజు   నుంచి   కలిసి   ఆడుకుంటూ   సమయం   గడిపేవారు”,  


అని   తెలుగు   మాష్టారు   కథను   ముగిస్తే,   మొదటి   బెంచి   మీద   కూర్చున్న   కిరణ్,   ఆవలిస్తాడు.   “ఏరా   కిరణ్!   అంత   పెద్దగ   ఆవలిస్తున్నావు.      నేను   చెప్పిన   కథ   నీకు   జోల   పాట   లాగా   అనిపిస్తోందా   ?”,   అని   తమాషాగా   అడిగారు   తెలుగు   మాష్టారు.


లేదు   సార్!   కథ   చాలా   బాగుంది.   మొదట్లో   కొంచెం   నెమ్మదిగా   అనిపించినా,   తరువాత   లిల్లీ   స్నూపీ   సంభాషణలు   బాగా   నచ్చాయి,   అని   కిరణ్   సమాధానమిస్తాడు.  


కథ   అంత   బాగా   నచ్చిందా!   అయితే   ఈ   కథ   వల్ల   నువ్వు   తెలుసుకున్న   నీతి   ఏంటో   చెప్పగలవా   ?,   అని   మాష్టారు   కిరణ్ ని   ప్రశ్నిస్తారు.


లిల్లీ   తను   కష్టపడి   చేసిన   ప్రయత్నం   విఫలమైనప్పటికీ,   గెలుపు   మీద   ఆశ   కోల్పోకుండా   అదే   నిగ్రహం   తరవాతి   ఆటలో   కొనసాగిస్తుంది.   మనం   కూడా   ఓటమి   ఎదురయ్యినప్పుడు   నిరాశ   పడకుండా,   అదే   పట్టుదలని   చూపించాలి,   అని   కిరణ్   వివరిస్తాడు.


బాగా   చెప్పావురా   కిరణ్!   నిజాయితిగా   చేసిన   ప్రయత్నం   గెలుపు   రుచి   చెయ్యక   మానదు”,   అని   తెలుగు   మాష్టారు   కిరణ్ ని   మెచ్చుకుంటారు.


కిరణ్ ని   మెచ్చుకున్నారో   లేదో,   వెంటనే   పక్కనే   ఉన్న   జానకి,   “నేను   కూడా   ఒక   నీతి   తెలుసుకున్నాను   సార్!”,   అంటూ   చేతులేత్తుతుంది.   అది   చూసి   తెలుగు   మాష్టారు,   “జానకమ్మా!   నువ్వు   తెలుసుకున్న   నీతి   ఏమిటమ్మా..??,   అని   ప్రాసతో   హాస్యంగా   జానకిని   అడుగుతారు.


నేను   తెలుసుకున్న   నీతి   ఏంటంటే,   “గెలుపు   వచ్చాక   స్నూపీ   లాగా   కళ్ళు   నేత్తికేక్కించుకోకూడదు.   లేకపోతే   ఒటమి   చవి   చూడాల్సి   వస్తుంది”,   అని   జానకి   వివరిస్తుంది.


జానకమ్మా!   నువ్వు   తెలుసుకున్న   నీతి   కూడా   బాగుందమ్మా!”,   అని   మళ్లీ   ప్రాసతో   జానకిని   మెచ్చుకుంటూ,   “ఇప్పుడు   నా   వంతు.   నేను   తెలుసుకున్న   నీతులు   చెప్తాను”   అని   మాష్టారు   తన   నీతుల   చిట్టా   విప్పారు.


మన   జానకమ్మ   చెప్పినట్లు,   గెలవడం   అనేది   పేకమేడలు   కట్టడం   లాంటిది.   ఏమాత్రం   చురుకుగా   లేకపోయినా   సరే,   ఇట్టే   కూలిపోతుంది


అనుభవిస్తే   కాని   అర్థం   కానివి   కొన్ని   ఉంటాయి.   
కాబట్టి   స్నూపీ   లాగా   ఎదుటి   వాళ్ళను     
అర్ధం   చేసుకోలేక   పోయినా,   హేళన   మాత్రం   చెయ్య   కూడదు


పశ్చాత్తాపానికి   మించిన   ప్రాయశ్చిత్తం   లేదు.   
కొన్ని   తప్పులను   దిద్దుకోవడానికి   అవకాశం   దొరుకుతుంది.   
స్నూపీ   లాగా   ఆ   అవకాశాన్ని   ఉపయోగించుకోవాలి



ఇలా   తెలుగు   మాష్టారు   తన   నీతులు   చిట్టా   విప్పిన   తరువాత   పాఠశాల   బెల్   మోగింది.   రేపు   ఇంకో   కథ   చెప్పుకుందామని,   మాష్టారు   క్లాసు   నుంచి   వెళ్ళగానే   గుసగుసలు   మొదలయ్యాయి. 
  


Popular Posts