ప్రియమైన అమ్ములుకి,
ఉత్తరం రాస్తుంటే ఏంటో కొత్తగా ఉంది.
అప్పుడెప్పుడో పదవ తరగతి తెలుగు పరీక్షల్లో ఉత్తరం రాసినట్లు గుర్తు.
2013 మే 13 న నువ్వు ఫోన్ చేసి, “నాకు హైదరాబాదు లో ఉద్యోగం వచ్చింది అన్నయ్యా....!! ”, అని చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. నా కళ్ళెదురుగా నువ్వు లేనప్పటికీ, నీ ఉత్సాహం అంతా నీ మాటల్లో కనపడింది.
నాకు చాలా గర్వంగా కూడా ఉంది. మన కుటుంబం లో మొట్టమొదట జీతం తీసుకుంటూ ఉద్యోగం చేయ్యబోతున్నావు.
మొదట్లో నిన్ను స్కూల్ లో చేరిపించేటప్పుడు నేను చాలా గొడవ చేశానమ్మా. నాన్న గారు పోయాక నాదే ఇంక అంగడి చూడాల్సిన భాద్యత.
"నాతో పాటు అంగడిలో పనులు చూసుకుంటూ, ఇంట్లో నీకు తోడుగా ఉంటుంది", అని అమ్మ తో అన్నాను.
అమ్మ నాకు అంగడి లో తోడుగా ఉంటానందే కాని, నిన్ను మాత్రం చదువు మానిపించే ప్రసక్తే లేదు అని పట్టు బట్టి మరీ స్కూల్ లో చేరిపించింది.
నన్ను క్షమించు అమ్ములు!
అప్పుడు ఏదో తెలియక అలా చేశాను.
అప్పుడు ఏదో తెలియక అలా చేశాను.
అయినా ఓ రకంగా అలా జరిగినందుకు ఒక ఉపయోగం కూడా ఉందిలే.
మా చదువుల తల్లి అమ్ములు కథ ఆసక్తికరంగా చందమామ కథ లాగా చెప్పడానికి అందులో ఒక విల్లన్ కూడా ఉన్నాడు J.
ఆరోజు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నపుడు ఉన్న ఆనందం, ఎక్కువ సేపు ఉండలేదు. ఇంజనీరింగ్ చదవడానికి పక్క ఊరుకి పంపించగలిగాను కాని ఇప్పుడు ఉద్యోగానికి ఒంటరిగా హైదరాబాదు పంపాలంటే ఏంటో దిగులుగా ఉంది. రోజులు చాలా దారణంగా అయ్యిపోయాయి. సమాజం లో అమ్మాయిలకు జరుగుతున్న అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
నీ ఉద్యోగం సంగతి మీ లెక్కల మాష్టారుతో మాట్లాడాను. ఆ మాటలు విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది!
పెప్పర్ స్ప్రే అని స్విస్ నైఫ్ అని ఆత్మరక్షణకి పనికొస్తాయట.
వాళ్ళ బంధువుల అమ్మాయి ఒకరు హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వెళ్తోందని ఇవి తెప్పిస్తున్నారట. నీ గురించి చెప్పగానే నీకు కూడా తెప్పిస్తానన్నారు లెక్కల మాష్టారు.
లెక్కల మాష్టారుకి ఒక సారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు కనిపించినా “అమ్ములు ఎలా ఉంది ..?? ఎప్పుడొస్తుంది సెలవులకు ఇంటికి ...??”, అని నీ గురించి ఖచ్చితంగా అడుగుతారు.
ఇంకో ముఖ్యమైన విషయం.
ఏకాంతగా ఉన్న ‘ఎటిఎం’ లో డబ్బులు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లోదమ్మా.
ఇవన్నీ నిన్ను భయపెట్టడానికి చెప్పట్లేదు అమ్ములు.
ఆపద ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.
నువ్వు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
చిన్నప్పుడు నువ్వు వ్యాస రచన పోటిల్లో “ఆరోగ్యమే మహా భాగ్యం!” అనే అంశం మీద వ్యాసం రాస్తే మొదటి బహుమతి వచ్చింది కదా!
గుర్తుందా …...???
ఉద్యోగం లో చేరాక ఆరోగ్యం నిర్లక్ష్యం చేయద్దు.
నువ్వు రాసిన వ్యాసం అప్పుడప్పుడు గుర్తు తెచుకుంటూ ఉండమ్మా.
ఇంక ఉంటాను!
---------------------------------------------------------------------------------
ఉద్యోగంలో చేరాక మొదటి నెల జీతం రాగానే అన్నయ్యకి అమ్మకి కొత్త బట్టలు, లెక్కల మాష్టారుకి ఒక గడియారం తీసుకుని ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది అమ్ములు.
ఆ రోజు వాళ్ళ జీవితం లో సంతోషకరమైన రోజులలో ఒకటిగా ముగిసింది.